వార్తలు

యువతరం … ఆధునిక సేద్యం

0

సంప్రదాయ, మూస విధానాలకు స్వస్తి పలుకుతూ నేటి తరం యువ ఆధునిక సేద్యం వైపు అడుగులు వేస్తూ వినూత్న రీతుల్లో దిగుబడులు, లాభాలు సాధిస్తూ పలువురికి స్ఫూర్తి గానూ నిలుస్తున్నారు. ఇలాంటి వారే ఆశ్వారావుపేట మండలం అచ్యుతాపురానికి చెందిన మేకల విజయకుమార్, అన్నపురెడ్డిపల్లికి చెందిన నరేష్.

వినూత్న సేద్యంతో లాభాలు తప్పకుండా వస్తాయని భావించే విజయకుమార్ బీటెక్ (ఈఈఈ) చదివి నల్గొండలో ఓ ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసి తనతో పాటు మరో పదిమందికి భృతి కల్పిస్తున్నారు. అయినా తనకున్న ఆసక్తితో ఇంటివద్ద అర ఎకరం బంతి, మరో పావు ఎకరం కూరగాయలు పండించడం ప్రారంభించారు. వాటికి తోడు కౌజు పిట్టల పెంపకం చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. తొలిదశలో 500 కౌజు పిట్టల పెంపకంతో ప్రారంభించి నేడు 1000 పిట్టలను పెంచుతున్నారు. కౌజు పిట్టల విక్రయం ప్రతిరోజు సాగుతుండటంతో నిత్యం చేతిలో ఆదాయం వస్తోంది. అలాగే కూరగాయలు, బంతి మొక్కలు  ఒకేసారి నాటకుండా దశలవారీగా నాటడంతో నిత్యం పూలు వస్తోన్నాయని విజయకుమార్ తెలిపారు.

సంప్రదాయ వాణిజ్య పంటలకు స్వస్తి పలికి ఆధునిక పంటలతో అధికలాభాలు సాధించవచ్చని నిరూపించారు నరేష్. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన నరేష్ విశాఖ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫార్మా కంపెనీలో కెమిస్టుగా పనిచేస్తున్నారు. తండ్రి చేసే మామిడి, వరి లాంటి సంప్రదాయ పంటలు, వాటి దిగుబడులు చూసి డ్రాగన్ ఫ్రూట్ వైపు దృష్టి సారించాడు. మూడేళ్ళక్రితం అన్నపురెడ్డిపల్లిలో తన వ్యవసాయ క్షేత్రంలో తొలిసారిగా 400 డ్రాగన్ మొక్కలతో ప్రయోగాత్మక సాగు ప్రారంభించారు. అది ఫలప్రదం కావడంతో నేడు సుమారు సిమెంటు స్తంభాలు ఏర్పాటు చేసి ఒక్కో స్తంభానికి నాలుగు మొక్కలు చొప్పున సుమారు 1700 మొక్కలు పెట్టారు. విత్తనం మొక్కలను గుంటూరు జిల్లా గురజాల నుంచి తెచ్చినట్లు నరేష్ తెలిపారు. ఎకరాకు సుమారు రూ. 4 లక్షలు ఖర్చు అవుతుందని, మార్కెట్ కు ఇబ్బందిలేదని, ఖర్చులు పోను మంచి ఆదాయమే వస్తోందని నరేష్ వివరించారు.

Leave Your Comments

వనపర్తి లోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పావు ఎకరాలో ఆలుగడ్డ సాగుచేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Previous article

ఇంగువ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like