ఆంధ్రప్రదేశ్వార్తలు

డ్రోన్లతో రసాయనాల పిచికారీ- సందేహలు మరియు సమాధానాలు

0

డ్రోన్‌ అనేది మానవ రహిత వైమానిక వాహనం, ఇది ఆటో పైలెట్‌ మరియు జిపిఎస్‌ కోఆర్డినేటర్ల సహాయముతో ముందుగా సెట్‌ చేసిన ఎత్తులో, వేగంతో మరియు  సరైన దిశలో ఎగురుతుంది. డ్రోన్ల పరికరం సాధారణ రేడియో తరంగాల నియంత్రణల ద్వారా నిర్వహించబడుతుంది. ఏదైనా లోపం లేదా ప్రమాదకరమైన పరిస్థితి సంభవించినప్పుడు లేదా ఏదైనా అడ్డం వచ్చినప్పుడు, దీన్ని మానవీయంగా నియంత్రిచవచ్చును. వ్యవసాయంలో డ్రోన్లు వినియోగం గత నాలుగు సంవత్సరాల నుండి విరివిగా అందుబాటులోకి వచ్చింది. వ్యవసాయ రంగంలో ఈ డ్రోన్లను భూమిని సర్వేలు చేయడానికి, విత్తనాలు విత్తడానికి, పురుగు మరియు తెగులుతోపాటుగా కలుపు మందుల పిచికారీ చేయడానికి, పంటలో చీడ పీడలను ఉనికిని గుర్తించడానికి ఉపయోగించవచ్చును. అయితే డ్రోన్లను రైతులు ఎక్కువుగా పిచికారీ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలా డ్రోన్లను మందులు పిచికారీకి ఉపయోగించినప్పుడు చాలా సందేహాలు వారికి కలుగుతున్నాయి. ఆ సందేహాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా నివృత్తి చేసుకుందాము.

1. రైతువారీ పద్ధతిలో మందులు పిచికారీ చేస్తున్నప్పుడు ఎకరానికి 12 నుండి 13 ట్యాంకులు (200 లీటర్ల) ద్రావణాన్ని ఉపయోగిస్తున్నారు. డ్రోన్లలో 10 లీటర్ల మందు ద్రావణం ఏ విధంగా సరిపోతుంది?
ఏదైనా మందు ద్రావణం స్ప్రేయర్‌తో గానీ డ్రోన్‌తో గాని పిచికారీ చేసినప్పుడు  పంపు యొక్క పీడనం వల్ల చిన్న చిన్న బిందువులుగా మారి మొక్క మీద పడుతుంది ఈ బిందువులు సాధారణంగా మూడు భాగాలుగా మొదటిది =150 µ m (microns)  చిన్న వ్యాసం గల బిందువులుగా, రెండవది 150 – 400 ’ m   మధ్యస్థ వ్యాసం గల బిందువులుగా, మూడవది = 400 µm ™   పెద్ద వ్యాసం గల బిందువులుగా విభజించబడతాయి. చిన్న వ్యాసం గల బిందువులు ఎక్కువగా గాలిలో ప్రయాణిస్తాయి. పెద్ద వ్యాసం గల బిందువులు వాటి యొక్క ఎక్కువ బరువు కారణంగా భూమి మీద పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మద్యస్థ వ్యాసం గల బిందువులు మాత్రమే పంట ఉపరితలాన్ని చేరి  చీడపీడల నివారణకు సమర్థవంతంగా పనిచేస్తాయి.
డ్రోన్‌తో పిచికారీ చేసినప్పుడు మందు ద్రావణం మధ్యస్థ వ్యాసం గల బిందువులుగా (150 – 400 ’ m )  విచ్ఛిన్నమవుతుంది. ఈ మధ్యస్థ వ్యాసం గల బిందువులు మొక్క మీద పడతాయి. కానీ పవర్‌ స్ప్రేయర్‌ లేదా నాప్‌ సాక్‌ స్ప్రేయర్‌తో పిచికారీ చేసినప్పుడు మందు ద్రావణం పెద్ద వ్యాసం (400  m  ) గల బిందువులుగా విచ్ఛిన్నం అవుతాయి. అందుకుగాను ఆ మందు ద్రావణం, మొక్క మీద పడకుండా భూమి మీద పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల మనం పిచికారీ చేసిన ద్రావణం లో 90 శాతం భూమి మీద పడిపోతుంది. అయితే డ్రోన్‌తో పిచికారీ చేసినప్పుడు  ఎక్కువ మొత్తంలో మందు ద్రావణం మొక్క మీద పడి చీడపీడలను సమర్థవంతంగా నివారిస్తుంది.

2. డ్రోన్‌తో ఉపయోగించే మందు యొక్క మోతాదు ఎంత ఉండాలి?
రైతు వారి పద్ధతిలో ఒక ఎకరానికి కావలసిన మందును 200 లీటర్లలో కలుపుతాము. డ్రోన్‌లో అదే 200 లీటర్లు లో కలిపే మందును 10 లీటర్ల ట్యాంకులో కలపాలి. ఉదాహరణకు ఏదైనా మందు సూచనల ప్రకారం 1.6 మి.లీ. / లీ. ఉంది అనుకుంటే, రైతు వారి పద్ధతిలో 200 లీటర్లు నీటిలో 320 మి.లీ.(ఎకరాకు)మందును కలుపుతాము. అదే డ్రోన్‌లో అయితే  320 మిల్లీ లీటర్ల మందును 10 లీటర్ల నీటిలో కలిపి డ్రోన్‌ ట్యాంకులో నింపవలసి ఉంటుంది. పరిశోధనల ప్రకారం 75%  (240 మి.లీ.)ముందును డ్రోన్‌లో ఉపయోగించినట్లయితే రైతువారీ పద్దతితో పొలిస్తే చీడ పీడల నివారణ సమర్ధవంతంగా నివారించడమే కాకుండా 25 శాతం మందును కూడా ఆదా చేయడం జరుగుతుంది.

3. సాధారణంగా వరి పంటకు తెగులు నివారణకు మొక్క కింది భాగంలో పిచికారీ చేస్తాము. డ్రోన్‌తో పిచికారీ చేసినప్పుడు మొక్క కింది భాగానికి మందు ద్రావణం చేరుతుందా?
డ్రోన్‌కి పై భాగంలో ప్రొపెల్లెర్స్‌ అమర్చబడి ఉంటాయి. ఇవి నిమిషానికి 9000 సార్లు తిరుగుతాయి. ఈ ప్రొపెల్లెర్స్‌ నుండి వచ్చే గాలి వత్తిడి వలన వరి మొక్క వంచబడుతుంది. ఈ విధంగా వంచబడిన మొక్క పైన మందు ద్రావణం పడటం వలన మొక్క కింది భాగంలో కూడా మందు ద్రావణం చేరుతుంది. రైతు వారి పద్ధతితో పోలిస్తే డ్రోన్‌తో చేసినప్పుడు ఎక్కువ మొత్తంలో మొక్క క్రింది భాగంలో మందు ద్రావణం పడినట్లు పరిశోధనలో గమనించడం జరిగింది.

4. ఈ విధంగా ప్రొపెల్లెర్స్‌ యొక్క గాలి వత్తిడి వలన వంచబడిన మొక్క ప్రక్కకు పడిపొయే అవకాశం ఉంటుందా?
ఈ డ్రోన్‌ ఒకే స్థానంలో ఉండకుండా సెకండుకు నాలుగు నుండి ఐదు మీటర్లు వేగంతో ప్రయాణించడం వలన పంట ఎటువంటి ప్రక్కకు పడిపొయే అవకాశం ఉండదు.

5. డ్రోన్‌ భారతదేశంలో ఉండే  చిన్న కమతాలకు సరైన యంత్రమా?
డ్రోన్‌ను చిన్న కమతాలకు సమర్థవంతంగా ఉపయోగించవచ్చును ఎందుకంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న 10 లీటర్ల డ్రోన్లు చిన్న కమతాలకు మాత్రమే సరిపడనున్నాయి, ఎందుకంటే వీటిని పెద్ద కమతాలకు ఉపయోగించడానికి పెద్ద పరిమాణం గల ట్యాంకులు ఉపయోగించవలసి ఉంటుంది. తద్వారా డ్రోన్‌ బరువు ఎక్కువగా అవుతుంది అందుకుగాను పెద్ద కెపాసిటీ గల ప్రొపెలర్స్‌ వాడవల్సి ఉంటుంది. దాని వలన గాలి వత్తిడి అధికమై పంట నేలకు ఒరిగిపోయే అవకాశం ఉంది. అందుకుగాను వ్యవసాయంలో ఉపయోగించే 10 లీటర్ల డ్రోన్లు చిన్న కమతాలంలో మాత్రమే  అతి సమర్థవంతంగా పనిచేస్తాయి.

6. డ్రోన్‌తో పిచికారీ చేసినప్పుడు మందు ద్రావణం ప్రక్క పొలాలకు గాలి ద్వారా చేరుతుందా?
డ్రోన్‌తో పిచికారీ చేసినప్పుడు మందు ద్రావణం ప్రక్క పొలాలకు గాలి ద్వారా చేరే అవకాశం ఉంది. కానీ అది లక్ష్య పొలం/ ప్రాంతం నుండి గరిష్టంగా ఐదు మీటర్ల వరకు మాత్రమే ఉంటుంది.

7. డ్రోన్‌తో పిచికారీ చేయడానికి నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయా?
డ్రోన్‌తో పిచికారీ చేయడానికి డ్రోన్‌ యొక్క వేగం మరియు పంట పైభాగం నుండి డ్రోన్‌ యొక్క ఎత్తు చాలా ముఖ్యమైన ప్రమాణాలు. ఇవి వివిధ పంటలకు వాటి యొక్క ఎత్తును బట్టి మారుతూ ఉంటాయి. ఆచార్య ఎన్‌.జి రంగా వ్యవసాయ   విశ్వవిద్యాలయం వారి సూచనల ప్రకారం పంట పూత దశ ముందు వరకు డ్రోన్లు పంట పై భాగం నుండి 0.6 మీటరు ఎత్తులోను 5.5 మీటరు/సెకెండు వేగంతో నడిపినప్పుడు మరియు పంట పూత దశ తర్వాత పంట పై భాగం నుండి 1 మీటర్‌ ఎత్తులోను మరియు 4.5మీటరు/సెకెండు వేగంతోను నడిపినప్పుడు పంటపై మందు ద్రావణం సమానంగా పడటమే కాకుండా, చీడ పీడలు నివారణ మరియు దిగుబడి అధికంగా ఉండటం గమనించడం జరిగింది.  అయితే వివిధ పంటలు యొక్క భౌతిక ప్రమాణాలు వేరుగా ఉండటం వలన డ్రోన్‌ నడిపే ప్రమాణాల మీద విస్తృతంగా పరిశోధనలు చేపట్టవలసిన అవసరం చాలా ఉన్నది.

8. డ్రోన్‌ సహాయంతో పోషకాలను పిచికారీ చేయవచ్చా ?
డ్రోన్‌ సహాయంతో పంట పెరుగుదలకు అవసరమైన మల్టీకె మరియు జింక్‌ లాంటి పోషకాలను సమర్ధవంతంగా ఉపయోగించవచ్చును. పంట పెరుగుదలకు రైతులు సాధారణంగా పోషకాలను న్యాప్‌ సాక్‌ స్ప్రేయర్‌తో పిచికారీ చేస్తారు. దీనికి బదులుగా డ్రోన్‌తో పిచికారీ చేసుకుంటే సమయం మరియు కూలీల ఖర్చు తగ్గించవచ్చు.

9. డ్రోన్‌ ఉపయోగించి చీడపీడల పిచికారీ చేయడం వలన ఎటువంటి లాభాలు ఉన్నాయి?

1. రైతు వారి పద్ధతిలో పోలిస్తే, డ్రోన్‌తో పిచికారీ చేయడం వల్ల 97 శాతం సమయాన్ని, 40 శాతం కూలీల ఖర్చును తగ్గించవచ్చు.

2. రైతు వారి పద్ధతిలో పిచికారీ చేసినప్పుడు పిచికారీ చేసే వ్యక్తికి శరీరం ద్వారా ఎక్కువ శాతం మందు ద్రావణం, మనిషి శరీరంలోనికి ప్రవేశించబడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా కొద్ది కాలానికి రైతులకు దీర్ఘకాలిక అనారోగ్య బారిన పడే అవకాశం  అధికంగా ఉంది. కానీ డ్రోన్‌తో పిచికారీ చేసినప్పుడు డ్రోన్‌ నడిపే వ్యక్తి దూరంగా ఉండటం వల్ల మందు ద్రావణం మనుషుల్లోకి వెళ్లే ప్రమాదం తప్పుతుంది.

3. డ్రోన్లను ఉపయోగించి పిచికారి చేయడం వలన 25 % మందును మరియు 95% నీటిని ఆదా చేయవచ్చును.

10.వ్యవసాయంలో ఉపయోగించే డ్రోన్‌ యొక్క ఖరీదు ఎంత ఉంటుంది ఎక్కడ కొనుక్కోవచ్చు?
వ్యవసాయ డ్రోన్‌ ఆరు సెట్ల బ్యాటరీలతో మరియు జనరేటర్‌తో కలిపి ఆరు లక్షలు ఉంటుంది. ఈ డ్రోన్లను విహంగ టెక్నాలజీస్‌- గుంటూరు, గరుడ ఏరోస్పేస్‌- చెన్నై, థానోస్‌- హైదరాబాద్‌, మారుట్‌ డ్రోన్స్‌- హైదరాబాద్‌ వంటి కంపెనీల నుండి కొనుగోలు చేయవచ్చు.

11. డ్రోన్‌ పైలెట్‌కు శిక్షణ ఎక్కడ లభిస్తుంది?
మన రాష్ట్రంలో డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అప్సర సెంటర్‌, లాం, గుంటూరు వారు 12 రోజుల శిక్షణ కేవలం 40 వేల రూపాయలకు అందుబాటులోనికి తీసుకువచ్చారు. ఈ శిక్షణ పూర్తి అయిన తరువాత డి.జి.సి.ఎ పైలెట్‌ సర్టిఫికెట్‌ ను కూడా అందజేస్తారు.

12. డ్రోన్‌ సేవలను బాడుగకు లభ్యం అవుతున్నాయా?
డ్రోన్‌ సేవలను IFFCO, Garuda, Drogo వంటి జాతీయ కంపెనీలతో పాటు, కోరమండల్‌ వంటి మల్టీ నేషనల్‌ కంపెనీ పైలెట్‌ శిక్షణ తీసుకున్న వివిధ గ్రామీణ యువత ఎకరాకు రూ.400 నుండి 500 రూపాయల చొప్పున అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ఇ. ఆర్‌.జి. కుసుమ, శాస్త్రవేత్త (వ్యవసాయ ఇంజనీరింగ్‌ )
డా.పి. వి. కె. జగన్నాధ రావు, ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయ ఇంజనీరింగ్‌ )
డా.పి. శ్రీదేవి, ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయ ఇంజనీరింగ్‌ )
డా.సి. హెచ్‌. ముకుంద రావు, అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌
ఆచార్య ఎన్‌. జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం
ప్రాంతీయ వ్యవసాయపరిశోధనా స్థానం, అనకాపల్లి, ఫోన్‌ : 9553469049.

Leave Your Comments

ఉద్యాన పంటల్ని నష్టపరుస్తున్న నత్తలు వాటి నివారణా చర్యలు

Previous article

You may also like