వార్తలు

అర్బన్ పార్కుల్లో శ్రీగంధ సువాసనలు..

0

అర్బన్ పార్కుల్లో శ్రీగంధ సువాసనలు పరిమళించనున్నాయి. మేడ్చల్ జిల్లా అంతటా ఉన్న అర్బన్ పార్కులు, రిజర్వు ఫారెస్ట్ ల్లో అంతరించిపోతున్న ఈ జాతి మొక్కలను విరివిగా పెంచాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. బహుళ ప్రయోజనాల దృష్ట్యా అధికారులు శ్రీగంధం మొక్కల పెంపకానికి సన్నద్ధమయ్యారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ ఆక్సిజన్ పార్కు నుంచి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. మొదటగా దూలపల్లి అటవీశాఖ రేంజ్ పరిధిలోని మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించినప్పటికీ ఆ తర్వాత జిల్లా అంతటా చేపట్టాలని అధికారులు సంకల్పించారు. శ్రీగంధం మొక్కతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కుల్లో పెద్ద ఎత్తున మొక్కలను పెంచి, అటవీ ప్రాంతంగా తీర్చిదిద్దారు.
ఒక్కో పార్కు వేల మొక్కలతో అలరారుతోంది. అయితే అటవీ ప్రాంతాన్ని మరింత దట్టమైన ప్రాంతంగా మలచడానికి శ్రీగంధం మొక్కలు ఉపయోగపడుతాయని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా వృక్షాల నీడలో ఏ మొక్క ఎదగదు. అంతేగాక భూమిలో ఉన్న ఇతర చెట్ల వేళ్ళ ఆధారంగా నిటారుగా ఎదుగుతుంది. పర్యావరణ హితం చేకూర్చే వివిధ రకాల పక్షులు, క్రిమి, కీటకాలు ఎదిగేందుకు ఆలవాలంగా మారి జీవ వైవిధ్యానికి దోహదం చేస్తుంది. అంతేకాదు ఇది భూమిపై ఉన్న అన్ని కలపల్లో కంటే ఖరీదైన కలప. అర్బన్ పార్కుల్లో శ్రీగంధం మొక్కల సాగులో ప్రతిరోజు అధికారుల పర్యవేక్షణ ఉండటంతో 90 శాతం కంటే ఎక్కువ మొక్కలు బతికించుకోవచ్చు. దూలపల్లి అటవీ శాఖ రేంజ్ లో ఉన్న కండ్లకోయ ఆక్సిజన్ పార్కుల్లో రెండువేలు, ఆయుష్, ప్రశాంతి వనాల్లో కలిపి మరో ఆరువేలు, 14 రిజర్వు ఫారెస్ట్ ల్లో కలిపి 20 వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న అటవీ కళాశాల విద్యార్థులతో కలిసి పీసీసీఎఫ్ శోభ మొక్కలు నాటి, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో ఉన్న అన్ని అర్బన్ పార్కులో శ్రీగంధం మొక్కలు పెంపకానికి జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కండ్లకోయ ఆక్సిజన్ పార్కు లో శ్రీగంధం పెంపకానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని మొక్కలను కొనుగోలు చేసి నాటారు.

Leave Your Comments

కివి పండ్లు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

వేసవిలో పశువుల ఆహార నిర్వహణ..

Next article

You may also like