కోడి పిల్లలను కొనుగోలు చేసి తీసుకొచ్చినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా పెంపకాన్ని చేపట్టాలి. పిల్లలుగా ఉన్నప్పుడే వాటికి వచ్చే జబ్బులను గుర్తెరిగి ఉండాలి. కాసింత పెద్దయ్యే వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఆ తరువాత ఆదాయం ఆశించిన విధంగా వస్తుందని పశువైద్యశాల వైద్యులు పెంపకందార్లకు పలు సూచనలు అందిస్తున్నారు.
పుట్టిన రోజు పిల్లలను 24 గంటల ముందు డెట్టాల్ ను కలుపుకుని పిల్లలను ఉంచే షెడ్డులోను వాటికి సంబంధించిన నీటి తొట్లను , మేత తొట్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా మూడు వారాలకు ఒకసారి చేసుకున్నా మంచిది. 1- 2 రోజుల పిల్లలను తెచ్చుకున్న వెంటనే బెల్లం, నిమ్మకాయ కలిపిన నీటిని రెండు రోజులు అందించాలి. ఎండాకాలం అయితే పుచ్చకాయ వంటివి కూడా అందిస్తే మంచిది. లేదంటే గ్లూకోజ్ పౌడర్, ఎలెక్ట్రోల్ పౌడర్ రెండు కలిపి తాపించాలి. 1 – 5 రోజుల పిల్లలకు ఆక్సీటెట్రాసైక్లిన్ లు కలిగిన 5 గ్రాముల పౌడర్ ను 2 లీటర్ల నీళ్లలో కలిపి ఇవ్వాలి. కొన్నిసార్లు ఇవి సొల్యూషన్ రూపంలో ఉంటే 0.25 నుంచి 0.5 మి.లీ. ను ఒక పిల్లకు ఇవ్వాలి. ఒకవేళ పిల్లలకి జబ్బు చేసి ఉన్నట్లైతే కోసు మిక్స్ ప్లస్ బైయోసల్ఫా లేదా డక్స్ ప్రిమ్ వంటి మందులను 1 గ్రా. లీటరు నీటిలో కలిపి తాపించాలి. జబ్బులు వచ్చినప్పుడు పుల్లటి మజ్జిగ, తెల్లవాయలను బాగా కలిపి తాపించాలి. నిమ్మకాయ రసం కూడా కలుపుకోవచ్చు. 6 -10 రోజుల పిల్లలకు అమినో యాసిడ్స్ కలిగిన బలవర్థక మందులను వాడవలెను. కాలేయ బలానికి ప్రతి 10 రోజులకు ఒకసారి లివర్ కు సంబంధించి వెల్లుల్లి, నిమ్మకాయ, కాలీఫ్లవర్ పసుపు వంటివి అందించవచ్చు. ఎముకల పెరుగుదలకు ప్రతి 3 రోజులకు ఒకసారి కాల్షియం టానిక్ లను వాడాలి. నట్టల నివారణకు ప్రతి 30 రోజులకు ఒకసారి ఆల్ బెండజోల్ 5 శాతం పౌడర్ 40 నుంచి 60 గ్రాముల మందు 100 పిల్లలకు తాపించాలి. వేపాకు లేదా ఆనియన్ లేదా తమలపాకు లేదా వక్క పొడిని తినిపిస్తే కడుపులో పురుగుల నుంచి విముక్తి లభిస్తుంది. కాక్సిడియా వ్యాధి నివారణకు ప్రతి 20 రోజులకోసారి ఆంప్రోలియం 30 గ్రాములు 50 లీటర్ల నీళ్లలో కలుపుకుని 5 రోజులు వాడాలి. సున్నపు నీళ్లు వాడినా తగ్గుతుంది. దాణా విషతుల్య నివారణకు ప్రతి 15 రోజులకు ఒకసారి క్యూరాటిక్స్ 1.5 కిలోలు 1 టన్ను దాణాకు కలిపి దాణా తడి లేకుండా ఎక్కువ ఆరబెట్టాలి. ఎండిన వేప ఆకులను కలుపుకుంటే పురుగు పట్టదు. శ్వాసకోశ వ్యాధుల నివారణకు టైలోటాన్ పౌడర్ 1 గ్రాము 1 లీటరు నీటికి కలుపుకుని 3 – 5 రోజులు వాడాలి. ప్రధమ చికిత్సగా అల్లం, తులసి ఆకులను తీసుకుని నీటిలో దంచి పలుచగా తయారుచేసి మూడు పూటల వాడుకోవాలి. గౌట్ వ్యాధి నివారణకు పౌడర్ గౌటిల్ లేదా నెప్రోక్లిన్ 3 -5 రోజులు వాడాలి. తమలపాకు ఆకులను ముక్కలుగా కత్తిరించి ఆహారంగా ఇవ్వాల్సి ఉంటుంది.