అనంతపురం జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పటి వరకు ఎన్నో ప్రత్యేకతలను చాటుతూ ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినా ఈ జిల్లా తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. కొద్ది రోజుల క్రితమే వ్యవసాయ రంగంలో జిల్లా ఉద్యాన శాఖ చేసిన కృషికిగాను స్కోచ్ అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం అమలు చేయడంలో అనంతపురం ముందువరుసలో నిలిచి మరోసారి కేంద్రం దృష్టిని ఆకట్టుకుంది. కేంద్రం ఏటా మూడు విడతల్లో రూ. 6 వేలు చొప్పున రైతులకు నేరుగా నగదును తమ ఖాతాల్లోకి బదిలీ చేస్తోంది. ఈ నగదు బదిలీ పథకంలో భాగంగా అర్హులైన రైతులను గుర్తించి వారికి ఫలాలను అందజేయడంలో జిల్లా యంత్రాంగం చూపిన చొరవను కేంద్రం కొనియాడుతూ అనంత జిల్లాకు పీఎం కిసాన్ జాతీయ అవార్డును ప్రకటించింది. కేంద్రం పీఎం కిసాన్ పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ అవార్డును ప్రకటించింది. కేంద్రం తీసుకొచ్చిన పథకం ఆయా రాష్ట్రాల్లో ఆయా జిల్లాలలో ఏ మేరకు అమలవుతోందనే విషయంపై పరిశీలించగా.. అనంతపురం తొలి వరసలో నిలిచింది. 99.60 శాతం మంది రైతులకు ఈ పథకం అందుతోంది. మొత్తం ఈ పథకానికి 28,505 మంది రైతులు అర్హులు కాగా వారిలో 99.60 శాతం మంది రైతులకు నగదు వారి ఖాతాలో జమ అవుతోంది. ఇక ఇదే విషయాన్ని కేంద్రం గుర్తిస్తూ అనంతపురంకు జాతీయ స్థాయిలో అవార్డును ప్రకటిస్తూ ఈ మేరకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడికి ఆహ్వానం పంపింది. ఈ నెల 24 వ తేదీన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఢిల్లీలో అవార్డును అందుకోనున్నారు. కలెక్టర్ తో పాటు పలువురు వ్యవసాయ అధికారులు కూడా ఈ కార్యక్రమంకు హాజరు కానున్నారు. ఇక ఈ మధ్యకాలంలో అనంతపురం జిల్లా పేరు జాతీయ స్థాయిలో వార్తల్లో ఎక్కువాగా వినిపిస్తోంది కనిపిస్తోంది. కరోనా కాలంలో కలెక్టర్ గంధం చంద్రుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. అంతేకాదు పలు రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయాలను అమలు చేశాయి. ఇక అనంతపురంలో ఆయా కాలనీలకు కులాల ఆధారిత పేర్లు ఉండకూడదని కాలనీలకు తమకు నచ్చిన మహానుభావుల పేర్లను పెట్టుకోవచ్చని పేర్కొంటూ కలెక్టర్ గంధం చంద్రుడు అమలు చేసిన సాహసోపేతమైన నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. అంతేకాదు పక్క రాష్ట్రాలు కూడా ఈ తరహా ఆలోచనను అమలు చేశాయి. అంతకు ముందు కరోనా కాలంలో అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైలును ప్రారంభించి సక్సెస్ కావడంతో ఈ జిల్లా అప్పట్లో మారుమోగిపోయింది.