కూరగాయల్లో పురుగుల తాకిడి పెరిగింది. వీటిని నియంత్రించడానికి రసాయనాల వాడకం తప్పనిసరి అయింది. దీనితోపాటు ఆధికంగా దిగుబడి ఇచ్చే రకాలు, సంకరజాతి రకాలు ప్రవేశపెట్టడం వల్ల ఉత్పతులు గణనీయంగా పెరిగాయి. విచక్షణా రహితంగా మందులు వాడకం వల్ల పురుగులకు నిరోధక శక్తి పెరగడమేకాకుండా, ఉత్ఫత్తుల్లో అవశేషాలు పెరిగి అలాగే మనకు మంచి చేసే మిత్రపురుగులు కూడా నశిస్తున్నాయి. ఫలితంగా రైతుకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. వాతావరణాన్ని పరిరక్షిస్తూ, వినియోగదారునికి విషతుల్యంకాని పంటను అందిస్తూ రైతు లాభపడాలి. ముఖ్యంగా కూరగాయల పంట అతి తక్కువ వ్యవధిలో చేతికందుతుంది. అందుచేత ఉత్పత్తులలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాటిని పరిమితులలోపు వుంచగలగాలి. అంతేగాక అంతర్జాతీయ మార్కెట్ లో నాణ్యత పోటీ తట్టుకోవడానికి, ఎక్కువ ధర రాబట్టుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది సాధించడానికి క్రిమిసంహారక మందుల మీదనే ఆధారపడకుండా జీవనియంత్రణ పద్ధతులకు, వృక్ష సంబంధ మందుల వాడకానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సాధారణంగా పండించే కొన్ని ముఖ్యమైన కూరగాయల్లో అనుసరించాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్దతులు పాటించాలి.
క్యాబేజి మరియు కాలీప్లవర్ పంటలలో సస్యక్షణ:
- ఆరోగ్యమైన నారుమడిని పెంచాలి. విత్తేముందు 100 గ్రా. విత్తనానికి 2 గ్రా. ట్రైకోడెర్మావిరిడి మందుతో విత్తన శుద్ధి చేయాలి.
- విత్తిన 15 రోజుల తరువాత నారుపై 1 గ్రా. బి.టి. సంబధిత మందుకు ఒక లీటరు నీటి చొప్పున కలిపి పిచికారి చేయాలి. ఆవాలు ఎరపంటగా ప్రతి 25 క్యాబేజి వరుసలకు 2 వరుసలు చొప్పున విత్తుకోవాలి.
- వేపగింజల ద్రావణాన్ని (5%) 10 రోజుల వ్యవధి తో పిచికారి చేయాలి. క్యాబేజిలో అంతరపంటగా క్యారేట్ మరియు టమోట వేయడంవల్ల రెక్కల పురుగుల ఉధృతి తగ్గుతుంది
- వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి.