పశుపోషణవార్తలు

పుంగనూరు గో జాతిని సంరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు..

0

పుంగనూరు గో జాతిని సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పులివెందులలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఆధునిక పశు పరిశోధనా కేంద్రంలో ప్రత్యేక పరిశోధనల కోసం నిధులు మంజూరు చేసింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతో అడుగులు ముందుకు వేయనున్నారు. త్వరలో సత్ఫలితాలు చూడవచ్చెనే ఆశాభావం పశుసంవర్థక శాఖ అధికారుల్లో వ్యక్తమవుతోంది. పుంగనూరు గో జాతి సంపద అంతరించిపోకుండా జీవం పోసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పులివెందులలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఆధునిక పశు పరిశోధనా కేంద్రంలో పుంగనూరు గో జాతిని వృద్ధి చేసే పరిశోధనల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి పిండమార్పిడి విధానం ద్వారా పునరుత్పత్తి సామర్థ్యం పెంచేందుకు పరిశోధనలు చేయాలని ప్రభుత్వం తిరుపతి పశువైద్య విశ్వ విద్యాలయాల శాస్త్రవేత్తలను ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన నిధులలో మొదటి విడతగా రూ. 29.30 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. చిత్తూరు జిల్లాలో ఉన్న అరుదైన పొట్టి రకానికి చెందిన పుంగనూరు గోవులు, ఆంబోతులకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది . అలాగే గోవుల పాలు వ్యాధి నిరోధక శక్తినిచ్చేవిగా ఉంటున్నాయని పలు పరిశోధనల్లో పశు వైద్య విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు నిరూపించారని గో సంరక్షణ ప్రేమికులు చెబుతున్నారు. ఈ గోవులు, ఆంబోతుల సంతతి రాను రాను తగ్గిపోతుండటంతో వీటి సంరక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది.
ఈ నేపథ్యంలో పుంగనూరు జాతి సంరక్షణ. ప్రత్యేకతపై విస్తృత ప్రచారం చేసేందుకు “మిషన్ పుంగనూరు క్యాటిల్ బ్రీడ్” పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఇన్ – వివో, ఇన్ విట్రో పిండం ఉత్పత్తి చేసి మేలు జాతికోసం పునరుత్పత్తి సామర్థ్యం పెంచాలని నిర్ణయించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల ద్వారా సాంకేతిక సాయాన్ని ఇక్కడి పిండోత్పత్తి శాస్త్రవేత్తలు స్వీకరిస్తారు. రాబోయే ఐదేళ్లలో పరిశోధనలు చేపట్టి ఫలితాలను రాబట్టేందుకు ప్రభుత్వం మొదటి విడతగా రూ. 29.30 కోట్లను మంజూరు చేసింది. ఇప్పుడున్న పుంగనూరు గో జాతి కంటే మెరుగైన సామర్థ్యంతో గోవులు, ఆంబోతులు ఉన్నాయి. ఇప్పటికే ఒకసారి తిరుపతి పశువైద్య విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు ఐజీ కార్ల్ ను సందర్శించి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ఇక పరిశోధనలు ప్రారంభం అవుతాయని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు.
పుంగనూరు జాతి గోవుల ప్రత్యేకతలు:
ప్రపంచంలోనే అత్యంత అరుదైన పొట్టి గోజాతి.
పాల దిగుబడులు తక్కువగా ఉన్నా ఇతర గోజాతుల కంటే మిన్నగా వెన్న 6 శాతంగా ఉంటుంది.
పుంగనూరు గోజాతిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉండటంతోపాటు సంకరజాతి గోజాతితో పోలిస్తే పుంగనూరు గోజాతి ఎండవేడిమికి తట్టుకుంటాయి.
పాలాదిగుబడి తక్కువ ఉన్నా కూడా ఆ పాలలో పోషకాలు మెండుగా ఉంటాయి.
ఆ పాలు తాగితే మనిషిలో ఉన్న రోగాలను నియంత్రించే గుణాలు ఉన్నాయని పశువైద్య శాస్త్రవేత్తలు తేల్చారు.
పుంగనూరు ఆవులకు పుట్టే దూడలు పొట్టిగా ఉన్నా రోగనిరోధక శక్తితో పాటు జీవితకాలం ఎక్కువ ఉంటుంది.
వీటి ధర ఇతర జాతులకంటే అధికంగా ఉంటుంది.

Leave Your Comments

ఏడాది పొడవునా మామిడి పండు అందుబాటులో ఉంటుంది.. రైతు శ్రీకిషన్

Previous article

తోటకూర ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like