Koheda Market: కోహెడ మార్కెట్ నిర్మాణ స్థలాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారుపరిశీలించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లక్ష్మీబాయి గారు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు గారు, కార్యదర్శి నర్సింహారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోహెడ మార్కెట్ నిర్మాణానికి తుది ప్రణాళిక సిద్దం అయ్యిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తర్వాత వారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ మార్కెట్ ను ఆకర్షించేందుకు తగినట్లుగా మార్కెట్ లో వసతుల ఏర్పాటు చేశామని.. దేశంలో నంబర్ వన్ మార్కెట్ మరియు కోహెడ ప్రపంచంలో అధునాతన మార్కెట్ గా ఉండబోతున్నదని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
కోహెడ మార్కెట్ 199 ఎకరాలలో మార్కెట్ నిర్మాణం జరుగుతున్నదని.. మార్కెట్ గోదాంలు, లాజిస్టిక్ పార్క్, ప్రాసెసింగ్ ప్లాంట్, వేస్ట్ మేనేజ్ మెంట్, రీ సైక్లింగ్ , సోలార్ సిస్టమ్ , కోల్డ్ స్టోరేజ్ గోదాంలు, రైపెనింగ్ చాంబర్లు, లేబర్, స్టాఫ్ క్వార్టర్ల తో కోహెడ మార్కెట్ నిర్మాణం రూపుదిద్దుకుంటున్నదని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులకు అనుగుణంగా సదుపాయాలు కల్పించబోతున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.
మామిడి ఎగుమతుల కోసం ప్రత్యేకంగా వేపర్ హీట్ ట్రీట్ మెంట్ ఇర్రాడియేషన్ ప్లాంట్ ఉందని షెడ్ల నిర్మాణం, కమీషన్ ఏజెంట్ల దుకాణాలు, కోల్డ్ స్టోరేజీలు నిర్మాణం,రహదారుల నిర్మాణం, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని అన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం మార్కెట్ స్థలంలో జరగాల్సిన నిర్మాణాల పరిశీలన చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
ఔటర్ రింగ్ రోడ్, ట్రిపుల్ ఆర్ రహదారి ఏర్పాటు, అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉన్న నేపథ్యంలో కోహెడ మార్కెట్ కు అత్యంత ప్రాధాన్యం ఉందని భవిష్యత్ లో ఏటేటా ఉద్యాన పంటల ప్రాధాన్యం పెరగనున్నది. ప్రపంచ ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఉద్యాన పంటల విస్తరణ పెరుగుతున్నది. దానికి అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ ఎగుమతులకు కోహెడ మార్కెట్ కీలకంగా నిలవనున్నది మంత్రి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.
Also Watch:
Leave Your Comments