Central responsibility for grain procurement ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం బాధ్యత అని గుర్తు చేశారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Agriculture Minister Niranjan Reddy ). ఈ మేరకు అయన మాట్లాడుతూ…దేశంలో రైతులు పండించే పంటలకు మద్దతుధర ప్రకటించడం, వాటిని సేకరించి, నిల్వ చేసి, కరువుకాటకాలు తలెత్తినప్పుడు కార్మికులు, సైనికులకు పంపిణీ చేయడమే కాకుండా సమాజంలో ఉన్న పేద బడుగు బలహీనవర్గాలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిరంతరం సరఫరా చేయడం కేంద్రప్రభుత్వ విధి అని అన్నారు. ఇది 1960 దశకం నుండి కొనసాగుతూ వస్తున్నది. కేంద్రం ప్రకటించిన మద్దతుధరకు వరి ధాన్యం కొనుగోలు చేయడం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్ సీ ఐ చేస్తుంది. 2015లో ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంతా కుమార్ కమిటీ పంటల కొనుగోలు మాత్రమే కాకుండా ఎఫ్ సీ ఐ సంస్థ పంటల ఎగుమతుల మీద కూడా దృష్టిసారించాలని, నిల్వల సామర్ధ్యం పెంచుకోవాలని, పండిన పంటలన్నీ మద్దతుధరకు కొనుగోలు చేయాలని నివేదికలో సూచించింది. కానీ కేంద్రం ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
తెలంగాణలో యాసంగి వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి దూడను చీకమని, బర్రెను తన్నమని చెప్పినట్లుంది. తెలంగాణలో ఈ యాసంగి నుండి బాయిల్డ్ రైస్ సేకరణ ఉండబోదని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. ధాన్యం సేకరణ, వరి సాగు విషయంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్ గార్లు భిన్న వాదనలతో తెలంగాణ రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్నారు. గత ఏడాది కొనుగోలు చేసిన ధాన్యం నుండి తీసిన బియ్యం ఇక్కడి గోదాముల నుండి తరలించకుండా, ఆ నెపాన్ని తెలంగాణ రాష్ట్రం మీద నెట్టి రైతులను కేంద్రం తప్పుదారి పట్టిస్తున్నది. ఇంకో వైపు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు అసలు వరి సాగు విషయంలో తాము తెలంగాణకు ఎలాంటి ఆంక్షలు విధించలేదని పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బాయిల్డ్ రైస్ సేకరించలేమని ఒకవైపు, వరి సాగు మీద ఆంక్షలు లేవని ఇంకో వైపు ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వంద విధానాలు స్పష్టంగా అర్దమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో గత సీజన్ లో సేకరించిన బియ్యం నిల్వలు ఖాళీ చేయకుండా సకాలంలో బియ్యం తరలింపుకు రైల్ ర్యాక్ లు పంపకుండా ఎఫ్ సీ ఐ వేధిస్తున్నది. కేంద్రం ప్రకటనలు ఈ విధంగా ఉంటే తెలంగాణ బీజేపీ నేతలు వరి సాగు మాత్రమే చేయాలని ప్రచారం చేస్తూ రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ రైతాంగం ఈ భిన్న వైఖరులను గమనించాలి. వాస్తవంగా దేశంలో కొరత ఉన్న పప్పుధాన్యాలు, నూనె గింజలను ఇతర దేశాల నుండి సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వెచ్చించే రూ.2 లక్షల కోట్లకు బదులు, శాంతాకుమార్ కమిటీ సూచన మేరకు దేశంలో వాటి సాగుకు, రాష్ట్రాల ద్వారా వాటిని సేకరించేందుకు కేంద్రం సహకారం అందించాలి. దేశంలో వివిధ రంగాలలో కార్పోరేట్ సంస్థలకు సుంకాలను తగ్గిస్తూ, లక్షల కోట్ల రుణాలను రద్దు చేస్తూ అండగా నిలుస్తుంది. కానీ ప్రపంచానికి అన్నం పెట్టే వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం అందించడం లేదు. ఈ విషయంలో కేంద్రం కార్పోరేట్లకు ఇస్తున్న సహకారం వ్యవసాయ రంగానికి అందిస్తే రైతులకు ఇబ్బందులు తొలుగుతాయి. ఆ దిశగా కేంద్రం ఆలోచించకపోవడం దురదృష్టకరం.
Telangana Paddy Issue తెలంగాణ నేలలు అన్నిరకాల పంటల సాగుకు అనుకూలం. దీనిని గమనించే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాగునీటి రంగానికి ప్రాధాన్యతనిచ్చి స్వల్పకాలంలో సాగునీరు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏ పంటకైనా సాగునీటి వసతి అనివార్యం. వరి సాగుకు మాత్రమే అనుకూలంగా ఉండే కొన్ని భూములను వదిలేస్తే మిగిలిన భూములలో వైవిధ్యమయిన పంటలను పండించవచ్చు. అందుకు తగిన వాతావరణ పరిస్థితులు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే సొంతం. అందులో తెలంగాణ ప్రాంతం ఒకటి. గతంలో బోర్ల కింద భిన్నపంటలు సాగుచేసిన అనుభవం తెలంగాణ రైతాంగానికి ఉంది.
Grain Procurement Is Central responsibility ప్రస్తుతం ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుని మార్కెట్లో డిమాండ్ ఉన్న వివిధ రకాల ఇతర పంటలను సాగు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి గాను తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ను ఏర్పాటు చేసి ప్రతి సీజన్ కు ముందే ప్రభుత్వ బాధ్యతగా ఏ రకమైన పంటలు సాగు చేయాలి ? రైతులకు ఎలాంటి లాభం ఉంటుందో దానికి అనుగుణంగా సూచనలు చేస్తున్నది. రైతు వేదికల ద్వారా క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు ఇతర పంటల వైపు మళ్లాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వస్తున్నారు. వరి సాగు సుళువుగా ఉండడం, ఇతర పంటల సాగులో కూలీల సమస్య ప్రధానంగా రైతులను వేధిస్తున్నది. అయితే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా వారి వైఖరిలో ఎటువంటి చలనం లేదు.
కేంద్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలను పసిగట్టిన తెలంగాణ ప్రభుత్వం గత కొంతకాలంగా తెలంగాణ రైతాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఆరుతడి పంటల వైపు మళ్లించే ప్రయత్నాలను చేస్తూ వస్తున్నది. అరవై ఏండ్లు నష్టపోయిన తెలంగాణ రైతాంగం సంతోషంగా పంటలు పండించుకుని ఆర్థికంగా స్థిరత్వం సాధించాలని తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను అర్ధం చేసుకుని తెలంగాణ రైతాంగం ఈ యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు మాత్రమే సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం ఇచ్చే, మార్కెట్లో డిమాండ్ ఉండే పప్పు గింజలు, నూనెగింజలు వంటి పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని ఆకాంక్షిస్తున్నది
అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. Telangana Paddy Procurement War