ఆంధ్రప్రదేశ్వార్తలు

సాంకేతికతతో ప్రకృతి సేద్యంలో అద్భుత ఫలితాలు

0
  • సాంకేతికతతో అన్నదాతల సాగు ఖర్చులు తగ్గించాలి
  •  ప్రకృతి సేద్యం రానున్న రోజుల్లో గేమ్ ఛేంజర్ అవుతుంది
  •  ప్రకృతి సేద్యం – అగ్రిడీప్ టెక్ విధానంతో దేశానికి ఎపి దిక్సూచి అవుతుంది
  •  డ్రోన్ల వినియోగంతో సాగులో అనూహ్య ఫలితాలు
  •  రబీ నుంచి రైతులకు పాత పద్ధతిలో పంటల బీమా
  •  వ్యవసాయ శాఖపై జరిపిన సమీక్షలో సిఎం చంద్రబాబు నాయుడు

ప్రకృతి సేద్యానికి సాంకేతికతను జోడించడం ద్వారా అనూహ్య, అద్భుత ఫలితాలు సాధించవచ్చని, రైతును నిలబెట్టి, సాగును మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని నూతన విధానాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. నేటి ఆధునిక యుగంలో సాంకేతికతను వినియోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. నాడు ఐటీ ఎలా అయితే గేం ఛేంజర్ అయ్యిందో…రానున్న రోజుల్లో పకృతి వ్యవసాయం కూడా గేం ఛేంజర్ అవుతుందని అన్నారు. ప్రకృతి సేద్యంలో ఎపి పయనీర్ గా నిలవాలని, దీనికి టెక్నాలజీని జోడించడం ద్వారా అనూహ్య, అద్భుత ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. ప్రకృతి సేద్యం – అగ్రిడీప్ టెక్ విధానంతో దేశానికి ఎపి వ్యవసాయ రంగంలో దిక్సూచి అయ్యేలా చేయాలని…అందుకు అవసరమైన ప్రణాళికలను అమలు చేయాలని వ్యవసాయశాఖపై సోమవారం (నవంబర్ 4 న) సచివాలయంలో జరిగిన సమీక్షలో సిఎం ఆదేశించారు. ఖర్చులు గణనీయంగా పెరిగి రైతులకు సాగు భారంగా మారిన పరిస్థితుల్లో టెక్నాలజీ ద్వారా ఆ ఖర్చులు తగ్గించాలని సూచించారు.

డ్రోన్ల వినియోగంతో సాగులో అనూహ్య ఫలితాలు:

పంటల సాగులో డ్రోన్ల వాడకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని సూచించారు. డ్రోన్ల ద్వారా పిచికారీతో 30 శాతంపైగా పురుగు మందు ఆదా చేయవచ్చు. 95 శాతం సమయం, నీరు, పవర్ ఆదా చేసి ఖర్చును తగ్గించుకోవచ్చు. రాష్ట్రంలో పంటల సాగుకు 40 వేల డ్రోన్లు అవసరం పడతాయని అధికారులు వివరించారు. సాగులో డ్రోన్లకు కేంద్ర ప్రభుత్వం రూ.8 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుందని, తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కూడా కల్పిస్తుందని ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సిఎం సూచించారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు డ్రోన్లపై శిక్షణ ఇచ్చి డ్రోన్ పైలెట్లుగా తీర్చిదిద్దితే ఇదొక కుటీర పరిశ్రమ అవుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా భూసార పరీక్షలు చేసి రైతులకు అవసరమైన పోషకాలు అందించే పరిస్థితి రావాలని సూచించారు.

ప్రకృతి సేద్యపంటల్లో వరదల నష్టం తక్కువ !

గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పకృతి సేద్యాన్ని గత ప్రభుత్వం పక్కన పెట్టిందని తెలిపిన అధికారులు. ప్రకృతి సేద్యంతో సాగయ్యే పంటలు సాధారణ పంటలకంటే ఎక్కువగా వరదలు, విపత్తులను తట్టుకుంటున్నట్లు పరిశీలనలో తేలిందని అధికారులు వివరించారు. రెండు నెలల క్రితం వచ్చిన భారీ వర్షాలు, వరదల సమయంలో చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయని తెలిపారు. ఒకే ప్రాంతంలో పక్క పక్కనే ప్రకృతి సాగు, సాధారణ సాగు చేసిన ఒకే రకమైన పంటలు వరదలకు దెబ్బతిన్న శాతాన్ని పరిశీలించి తాము ఈ అంశంపై నివేదిక సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. వరదల కారణంగా కెమికల్ ఫార్మింగ్ జరిగే పంటలు 100 శాతం దెబ్బతింటే ఆ పక్కనే ఉన్న ప్రకృతి వ్యవసాయం కింద సాగయ్యే పంట 10 శాతం మాత్రమే దెబ్బతిన్నట్లు తాము గుర్తించామని అధికారులు తెలిపారు. ఇది చాలా కీలకమైన అంశమని రైతులను ప్రకృతి సాగు వైపు తీసుకువెళ్లడానికి ఈ సమాచారం ఎంతో  ఉపయోగపడుతుందని సిఎం అన్నారు. ఇలాంటి సమాచారాన్ని ప్రజల వద్దకు చేర్చి వారిని పకృతి సేద్యం లాభాల గురించి తెలుసుకునేలా చేయాలని సిఎం చెప్పారు. అంతకుముందు అధికారులు పంట ఉత్పత్తుల పెంపు, సాగు విస్తీర్ణం పెంపు, భూసార పరీక్షలు వంటి అంశాల్లో తీసుకున్న చర్యలను సీఎంకు వివరించారు.

జూలై నెలలో జరిగిన పంటనష్టానికి సంబంధించి రూ.37 కోట్లు రైతులకు పరిహారం కింద చెల్లించాల్సి ఉందని అధికారులు చెప్పగా…ఆ నిధుల విడుదలకు సిఎం అంగీకారం తెలిపారు. సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదలతో రైతుల పంటనష్టానికి గాను రూ.319 కోట్లు నెలరోజుల వ్యవధిలోనే చెల్లించినట్లు అధికారులు తెలిపారు. క్యాబినెట్ సబ్ కమిటీ సూచనల ప్రకారం ఈ రబీ నుంచి పాత పద్దతిలో క్రాప్ ఇన్స్యూరెన్స్ అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

Leave Your Comments

కొత్తగా నియమితులైన వ్యవసాయాధికారుల దిశానిర్ధేశం – మంత్రి తుమ్మల

Previous article

కంది పంట పూత దశలో..ఏయే చీడపీడలు ఆశిస్తాయి? వాటిని ఎలా నివారించుకోవాలి?

Next article

You may also like