Green Gram Cultivation: మన దేశంలో పెసర పంట మూడవ అతి పెద్ద పంటగా సాగు చేస్తున్నారు. పెసర పంట తక్కువ కాల పరిమితి, ఉంటూ అంతర పంటగా కూడా సాగు చేస్తున్నారు.పెసర పంట పచ్చి రొట్ట ఎరువులుగా నేల సారాన్ని, నేల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.పెసరలో 25 శాతం ప్రోటీన్లు కలిగి ఉంటుంది. ఇది త్వరగా అరుగుదల ఉండే పప్పు ధాన్యపు పంట. పెసర పంట తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో తొలకరిలో కోస్తాంద్రలో రబీ పంటగా పండిస్తారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెసర పంట సాగు విస్తీర్ణం 18.27 లక్షల ఎకరాలు, ఉత్పత్తి 3.84 లక్షల టన్నులు ఉంటుంది.
భారత దేశంలో పెసర పండించే ప్రధాన రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి.
వాతావరణం:
పెసర పంట సాగుకు పొడి వాతావరణం ఉండాలి. 600-800 మి.మీ వర్ష పాతం ఉన్న ప్రాంతాలలో సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది.
ఈ పంట తక్కువ ఉష్ణోగ్రత, అధిక వర్షాన్ని నీటి నిల్వను తట్టుకోలేదు. పెసర పంట సాధారణంగా 20-40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మంచి దిగుబడి వస్తుంది.
నేలలు:
1. పెసర పంటను అన్ని రకాల నేలల్లో సాగు చేయువచ్చు.
2. చౌడు భూములు, మురుగు నీరు నిల్వ ఉండే నేలలు పనికి రావు.
3. పి. హెచ్ 6.7 నుండి 7.5 ఉండాలి.
నేల తయారీ:
ఒక సారి నాగలితో, రెండు సార్లు గొర్రుతో మెత్త గా దున్ని గుంటకతో నేలను తయారు చేయాలి. వరి కోసిన తర్వాత దుక్కి దున్నవలసిన అవసరం లేదు.
విత్తే సమయం:
ఖరీఫ్: తెలంగాణ తక్కువ వర్ష పాత మండలాల్లో జూలై నెలలో విత్తుకుంటారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాంలో జూస్-జూలై నెలల్లో విత్తుకోవచ్చు.
రబీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో అక్టోబర్ నెలలో విత్తు కోవచ్చు, నవంబర్- డిశంబర్ మొదటి వారంలో కూడా విత్తు కోవచ్చు. వేసవి కాలంలో ఫిబ్రవరిలో విత్తుకోవచ్చు.
Also Read: Black Gram Cultivation: మినుము పంటను ఇలా సాగు చేసి మంచి దిగుబడిని పొందండి..
విత్తన మోతాదు:
ఖరీఫ్ -6-6.4 కిలోల విత్తనాలు ఎకరానికి విత్తుకోవాలి.
రబీ , వరికోతల తర్వాత వేసవి వరి కోతలో 12-14 కిలోల విత్తనాలు ఎకరానికి, వేసవిలో 6.4-7.2 కిలోల విత్తనాలు ఎకరానికి విత్తుకోవాలి.
విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బో సల్ఫాస్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. పెసర పంట కొత్తగా పండించే సమయంలో రైజోబియం కల్చర్ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి వస్తుంది.
ఎరువులు: చివరి దుక్కిలో ఎకరాకు పశువుల ఎరువులు రెండు టన్నులు, నత్రజని 8 కిలోలు, భాస్వరం 20 కిలోలు వేయాలి. వరి కోతలు అయ్యాక పెసర పంట సాగు చేస్తే ఎరువులు వాడాల్సిన అవసరం లేదు.
నీటి యాజమాన్యం:
పెసర పంట వర్షాధార పంట కాని వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1,2 తడులు ఇస్తే మంచి దిగుబడి వస్తుంది.
వేసవిలో పండించే పెసరకు 25-30 రోజులకి ఒక సారి 45-50 రోజులో మరోక సారి తేలిక తడులు ఇవ్వాలి.
కలుపు నివారణ:
విత్తే ముందు ఫ్లూక్లోరాలిస్ ఒక లీటరు , 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేసి కలియ దున్నాలి. విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు కానీ పెండి మిథాలిన్ ఎకరానికి 1.6 లీటర్లు, 200 లీటర్ల నీటిలో కలిపి భూమి పై తేమ ఉన్నపుడు పిచికారీ చేసి కలుపును నివారించ వచ్చు.
అంతర పంటలు:
పెసర పంటను అంతర పంటగా ప్రత్తి, కందిలో వేసుకోవచ్చును.
పంట కోత:
తొలకరిలో పండిన కాయలను 1,2 సార్లు కోసి ఆరపెట్టుకోవాలి. రబీ కాలంలో లేదా వేసవిలో కానీ మొక్కను
మొదలు వరకు కోసి ఎండిన తర్వాత ఆరపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండబెట్టిన విత్తనాలను నిల్వ చేసుకోవాలి.
Also Read: Milk Production: పాల వినియోగం పెరుగుతుంది.. పశువుల సంఖ్య తగ్గుతుంది.!