Vegetable Cultivation: కూరగాయల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. రాష్ట్రంలో దాదాపు 1.42 లక్షల హెక్టార్లు విస్తీర్ణంలో కూరగాయలు పండిస్తున్నారు. కూరగాయల సాగు సన్న, చిన్నకారు రైతులకు తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడిని సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో టమాట, వంగ, బెండ, చిక్కుడు, క్యాబేజి, కాలిఫ్లవర్, బీర, కాకర మరియు ఆకు కూరల సాగు చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో అనుకూల వాతావరణ పరిస్థితులల్లో వాణిజ్యపరంగా కూరగాయలను హరిత గృహాలలో కూడా సాగు చేసి మంచి దిగుబడులను సాధిస్తున్నారు. కానీ కూరగాయ సాగులో ప్రస్తుతం హైబ్రిడ్ వంగడాలను వాడటం వలన మరియు మారుతున్న వాతావరణం వలన చాలా రకాల పురుగులు మరియు తెగుళ్ళ వలన నష్టం కలుగుతుంది. కూరగాయల పంటలలో ఆకుతినే పురుగులు, రసంపీల్చే పురుగులు, కాయతొలిచే పురుగులు అన్ని కూరగాయల పంటలను ఆశించి నష్టం కలుగజేస్తాయి.
రసం పీల్చే పురుగులు వైరస్ తెగుళ్ళకు వాహకాలుగా ఉండి, వైరస్ తెగుళ్ళను వ్యాపింపజేస్తాయి. రసం పీల్చే పురుగుల వలన 40 శాతం వరకు నష్టం కలుగుతుంది. కూరగాయల సాగులో బయట కానీ, హరిత గృహాలలో సాగు చేసేటప్పుడు క్రింద తెలుపబడే సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటిస్తే రైతుకు ఖర్చు తగ్గడమే కాకుండా, పురుగు మందు అవశేషాలు తగ్గడంతో పాటు మంచి దిగుబడి పొందవచ్చు.
Also Read: Foods that lower Cholesterol: చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే కొన్ని ఆహార పదార్థాలు.!

Vegetable Cultivation
విత్తనశుద్ధి :
* మంచి నాణ్యమైన విత్తనాన్ని ఎన్నుకోవాలి.
* విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళను నివారించడానికి కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టాన్ లేదా మాంకోజెబ్ లేదా 6 గ్రా. మెటలాక్సిల్ లేదా 10 గ్రా. ట్రైకోడర్మా విరిడే కలిపి విత్తనశుద్ధి చేయాలి.
* రసం పీల్చే పురుగుల నివారణకు కిలో విత్తనాన్ని 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధి చేయాలి.
నారుమడిలో సస్యరక్షణ :
* విత్తేముందు నేలలోని శిలీంధ్రాలను నివారించుటకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2 గ్రా. మెటలాక్సిల్ లీటరు నీటిలో కలిపి నారుమళ్ళను బాగా తడపాలి.
* మొలకెత్తిన వారం రోజులకు రసంపీల్చే పురుగుల నుండి రక్షణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ లేదా థయోమిథాక్సామ్ 0.3 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి. పిచికారి చేయాలి.
* పెరిగిన నారు ప్రధాన పొలంలో నాటే ముందు 2 మి.లీ. డైమిథోయేట్ మరియు 1 గ్రా. కార్బండాజిమ్ లీటరు నీటికి కలిపిన ద్రావణంలో 20-30 నిమిషాలు వేర్లు తడిసేలా ఉంచితే ప్రధాన పొలంలో రసంపీల్చే పురుగులు మరియు తెగుళ్ళ ఉధృతి అదుపులో ఉంటుంది.
ఈ మధ్యకాలంలో రైతులు ప్రోట్రేలలో నారుని పెంచుకుంటున్నారు. వైరస్ తెగుళ్ళను వ్యాప్తి చేసే తెల్లదోమ, తామరపురుగులు, పచ్చదోమ, పేనుబంక వంటి పురుగులు ఆశించకుండా ఈ ప్రోట్రేలను పాలిటన్నెల్స్ లేదా నెట్ హౌస్లో పెంచుకోవాలి.
Also Read: Sesame Crop: వేసవి పంటగా నువ్వులను విత్తుకునుట.!