Oilseed Cultivation: భారత దేశం వ్యవసాయ దేశం అయినప్పటికీ చాలా రకాల వస్తువుల కోసం ఇతర దేశాల మీద ఆధార పడుతుంది. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరిగితే మన దేశంలో నూనె రేట్లు మంటలు మండుతున్నాయి. దీనికి కారణం ప్రణాళిక మరియు పరిపాలనా లోపమే. మిన్నంటుతున్న రేట్లను చూసాక నూనెగింజల ఆధారిత ఉత్పత్తి, ఉత్పాదకత మరియు లాభదాయకతను పెంపొందించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యూహాలు రచిస్తుంది . వార్షిక నూనెగింజల పంటల, ఆయిల్ పామ్ ఉత్పత్తి పెంచడం కోసం ఉత్పత్తి వ్యవస్థలు(ఫుడ్ సిస్టమ్స్) తయారు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆర్డర్లు జారీ చేసింది.నూనెగింజలలో ఉత్పత్తి పెంచడాన్ని స్కేల్ న్యూట్రాలిటీతో(ఎంత వరకు సత్ఫాలితాలు వచ్చాయని చూడడం) జరుగుతాయని తెలిపింది.ప్రతిపాదిత వ్యూహాలు ఈ కింద పొందుపరిచిన 6 పరిస్థితుల క్రింద వర్గీకరించబడ్డాయి.
1. నూనెగింజల పంటలను క్షితిజసమాంతర (సాగు ప్రాంతం విస్తరణ) మరియు నిలువు (పంట ఉత్పాదకత పెరుగుదల)ను విస్తరించడం. మొత్తంగా చెప్పుకుంటే సాగు చేస్తున్న విస్తీర్ణం మరియు ఉత్పర్దకతను పెంచే పనులను చేపట్టడం.
2. కొత్త వంగడాల తయారీ, విడుదల చేసిన రకాల విత్తనోత్పత్తి, రైతులకు ఉచిత పంపిణీ. రాబోయే రోజులలో నూనె గింజల పంటల సాగుకు రైతులకు ఉచిత విత్తనాలు వచ్చే అవకాశం రానుంది.
3. అధిక ఉత్పాదకత, ఫలితంగా అధిక ఆదాయం సమకూర్చే రకాల తయారీ, తక్కువ ఖర్చు, శ్రమతో కూడిన సాంకేతికతలు అభివృద్ధి చేయుట. తద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధించే పంట పద్ధతుల వైపు అడుగులు వేయాలన్నది ముఖ్యోద్దేశ్యం.
4. తక్కువ పెట్టుబడి, ఎక్కువ ప్రతిఫలం ఉండే టెక్నాలజీలను అందుబాటులో ఉంచడం. ఇవి ఖచ్చితంగా పర్యావరణ హితంగా, ఎక్కువ సమర్థత కలిగి ఉండాల్సిందిగా శాస్త్రవేత్తలకు దిశా నిర్దేశం చేశారు.
5. వ్యవస్థాపకత అభివృద్ధి, నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చే వ్యూహాలు మరియు విలువ జోడింపు సాంకేతికతలను పెంచడం. అనగా కొత్త పరిశ్రమలకు చేయూత, ఆయిల్ మిల్లుల ఏర్పాటుకు రాయితీలు, నూనె సంబంధిత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీల స్థాపనకు తోడ్పాటును అందించడానికి ప్రణాళికలు చేస్తున్నారు.
6. నూనె గింజల కోసం అదనపు సాగు ప్రాంతాన్ని పెంచడానికి వ్యూహాలు మరియు వరి ఆధారిత భూముల్లో నూనె గింజల ఉత్పత్తి, నూనె గింజలతో అంతర పంటల సాగు మరియు పంటల వైవిధ్యీకరణ వంటి అంశాలను కూడా వ్యవసాయ శాఖ అభివృద్ధి చేయనుంది. ఇవి గనక విజయవంతం అయితే నూనె పంటల కోసం సాంప్రదాయేతర సీజన్‌లలో నూనె గింజలను సాగు చేయవచ్చు మరియు సాంప్రదాయేతర ప్రాంతాలలో కొత్త పంట విధానాలను అన్వేషించడానికి అవకాశాలు కూడా ఉన్నాయి.