Hybiz Media Awards 2023: హైబిజ్ టీవీ వారు హైటెక్స్ లో బుధవారం నిర్వహించిన హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ ఫంక్షన్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు “ఉత్తమ ప్రింట్ అగ్రికల్చరల్ జర్నలిస్ట్” పురస్కారాన్ని సాక్షి సాగుబడి ఇన్ ఛార్జ్ పంతంగి రాంబాబు గారికి అందజేశారు. పాత్రికేయుడిగా పంతంగి రాంబాబు గారు 37 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. గతంలో వీరు విశాలాంధ్ర, ఆంధ్రభూమి డైలీలో పని చేశారు. సాక్షిలో గత 15 ఏళ్లుగా వీరు పనిచేస్తూ ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేంద్రియ ఇంటిపంటల, ప్రకృతి వ్యవసాయం, సిరిధాన్యాల వ్యాప్తికి విశేష కృషి చేస్తూ ట్రెండ్ సెట్టర్ గా పేరొందారు.
సాక్షి దిన పత్రికలో ప్రతి మంగళవారం ప్రచురితమయ్యే “సాగుబడి” పేజీని దశాబ్దకాలంగా రైతు జనరంజకంగా పంతంగి రాంబాబు గారు నిర్వహిస్తున్నారు. సేంద్రియ ఇంటిపంటలపైనా గత 12 ఏళ్లుగా కథనాలు రాస్తూ ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. అలాగే గత సంవత్సరంగా “సాక్షి ఫన్ డే” లో ప్రపంచవ్యాప్తంగా అర్బన్ అగ్రికల్చర్ పోకడలపై కాలమ్ రాస్తున్నారు. ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్, మట్టి సేద్య నిపుణుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి మరియు స్వతంత్ర శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్ వలి వంటి గొప్ప వారి కృషిని తెలుగు రాష్ట్రాల ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తేవడంలో పంతంగి రాంబాబు గారు విశేష కృషి చేస్తున్నారు.
Also Read: Coconut Plantations: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కొబ్బరి తోటల సాగు.!
అలాగే, వ్యవసాయ శాస్త్రవేత్తలు, గ్రామీణులు ఆవిష్కరించిన పలు యంత్ర పరికరాలను వెలుగులోకి తేవడంలో అత్యుత్తమ కృషి చేసినందుకు గాను నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (NIF) వారు 2017లో ఇచ్చిన జాతీయ పురస్కారాన్ని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో సాక్షి పత్రిక తరుపున రాంబాబు స్వీకరించారు. వీరితో పాటు సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిశోర్ తో పాటు వివిధ పత్రికలు, సోషల్ మీడియా సంస్థలు, శాటిలైట్ ఛానళ్లలో సేవలందిస్తున్న పాత్రికేయులు, వీడియో జర్నలిస్టులు పలువురు పురస్కారాలు అందుకున్నారు. అలాగే ఉత్తమ న్యూస్ ప్రజంటర్ గా సాక్షి టీవీ సీనియర్ ప్రజంటర్ DV నాగ కిశోర్ గారు పురస్కారాన్ని అందుకున్నారు. వీరు న్యూస్ ప్రజంటర్ గా, సీనియర్ జర్నలిస్ట్ గా 23 సంవత్సరాల నుండి టెలివిజన్ రంగంలో పని చేస్తున్నారు. దీంతో పాటు హైబిజ్ టీవీ ఈ కార్యక్రమంలో ఆర్ధికంగా వెనుకబడిన మీడియా సిబ్బంది కుటుంబంలోని చురుకైన పిల్లలకు 25 వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్ ను అందజేసింది. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.
Also Read: PJTSAU: పీజేటీఎస్ఏయూలో మూడు రోజులపాటు జరగనున్న విస్తరణ విభాగం రాష్ట్రస్థాయి సదస్సు