పుట్టగొడుగులు అనేవి ఫంగస్ (శిలీంద్ర) జాతికి చెందిన చిన్నమొక్కలు. వీటిలో బాగా పోషక విలువలు ఉన్నందున పోషకాల లేమితో భాధపడే వారికి, మహిళలకు, పిల్లలకు చాలా మంచి ఆహారం. పుట్టగొడుగుల్లో మాంసకృత్తులు, విటమిన్లు (బి,సి), ఖనిజ లవణాలు (భాస్వరం, సున్నం, పొటాషియం, విటమిన్లు, రాగి, ఇనుము), పీచు పదార్ధాలు అధికంగా ఉండి, కొవ్వు, పిండి పదార్థాలు తక్కువ మోతాదులో ఉంటాయి. ప్రతి 100 గ్రాముల పుట్టగొడుగుల నుంచి 43 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 2000 రకాలకు పైగా పుట్టగొడుగులు ఉన్నప్పటికీ 200 రకాలు మాత్రమే తినగలిగినవిగా గుర్తించడమైంది. వాటిలో కృత్రిమంగా 3 లేదా 4 రకాలు మాత్రమే పెంచుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా ముత్యపుచిప్ప పుట్టగొడుగుల పెంపకం ప్రాచుర్యం చెందింది.
పెంపక విధానం:
ముత్యపు చిప్ప/ ఎల్మ్ ముత్యపు చిప్ప పుట్టగొడుగులు పెంచడానికి మొదట శుభ్రమైన వరిగడ్డిని తీసుకొని 3- 5 సెం.మీ వరకు ముక్కలుగా కత్తిరించి,10 కిలోల గడ్డి ముక్కలను 100 లీటర్ల నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు నానబెట్టిన గడ్డి ముక్కలను తీసుకొని మరుగుతున్న నీటిలో 100 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద అరగంట సేపు ఉడక బెట్టి శుద్ది చేయాలి లేదా రసాయన పద్ధతిలో అయితే 100 లీటర్ల నీటిలో 7.5 గ్రా. బావిస్టిన్ (కార్బెండాజిమ్) మరియు 250 మి.లీ. ఫార్మాల్డిహైడ్ కలిపి దానిలో 10 కిలోల గడ్డి ముక్కల్ని నీటిలో మునిగే విధంగా 12-16 గంటల పాటు ఉంచి శుద్ధి చేయాలి. ఈ గడ్డిని బయటకు తీసి అరగంట సేపు చల్లని ప్రదేశంలో ఆరబెట్టాలి. స్వచ్ఛమైన పుట్టగొడుగుల విత్తనాన్ని(స్పాన్) డెట్టాల్ తో శుభ్రపరిచిన ట్రేలో ఇనుపరాడ్ తీసుకొని ఉండలు లేకుండా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత 100 గేజిల మందం గల పాలిథీన్ సంచులు 12×18 అంగుళాలు లేదా 14×24 అంగుళాల సైజు కవర్లను తీసుకొని వాటికి 1 మి.మీ సెజుగల 12 నుంచి 15 రంధ్రాలు చేయాలి. ప్లాస్టిక్ కవరులో శుద్ధి చేసిన గడ్డి ముక్కల్ని 5సెం.మీ మందం వరకు వేసి ఉపరితలంపైన గుప్పెడు పుట్టగొడుగుల విత్తనాన్ని చల్లాలి. ఇలా చేసిన పాలిథీన్ సంచులను మూడవ వంతువరకు నింపి రబ్బరు బ్యాండుతో మూసి వేయాలి. ఒక కిలోస్పాన్ (విత్తనానికి) 10 బ్యాగులు వస్తాయి.ప్రతి పాలిథీన్ కవరులో 100 గ్రా. విత్తనాన్ని వేయాలి. ఇలా చేసిన తర్వాత 10 ×12 అడుగుల గదిలో కొయ్య లేదా ఇనుపరాడ్స్ ని ముందుగా ఫార్మాల్డిహైడ్ 2 శాతంతో శుద్ధి చేసిన గదిలో వరుస క్రమంలో అమర్చుకోవాలి. శుభ్రంగా, చల్లగా ఉన్న గదిలో ఎప్పటికప్పుడు తడిగా ఉండేలా నీళ్ళు చల్లుకోవాలి. మూడు నుంచి నాలుగు వారాలలో గడ్డి ముక్కలపైన తెల్లని శిలీంద్రము దట్టంగా వ్యాపిస్తుంది. ఇలా తయారైన బెడ్లను శుద్ధి చేసిన బ్లేడుతో కత్తిరించాలి. గదిలో గాలి, వెలుతురు సరఫరా అయ్యేలా చేసుకోవాలి. పాలీధీన్ సంచులను బ్లేడుతో కత్తిరించాలి. ఇలా చేసిన తర్వాత 6 నుంచి 7 రోజులకు మొదటి పంట వస్తుంది. బెడ్లను రోజుకి రెండు సార్లు తడిపి తేమ 65 శాతం ఉండేలా చూసుకోవాలి. తర్వాత 15 రోజుల వ్యవధిలో రెండవ, మూడవ పంట వస్తుంది. బెడ్లను ప్రతి రోజు పరిశీలిస్తూ నలుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగు ఉన్నబెడ్లను తీసి దూరంగా గుంటలో వేయాలి. లేకుంటే ఇతర బెడ్లకు వ్యాపించే ఆవకాశముంది. ప్రతి కిలో ఎండుగడ్డి నుంచి దాదాపుగా కిలో పచ్చి పుట్టగొడుగులు వస్తాయిలు.
కోత- మార్కెటింగ్:
పుట్టగొడుగులను తాజాగా ఉన్నప్పుడే 24 గంటల్లో మార్కెటింగ్ చేయాలి. ఫ్రీజ్ లో అయితే 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అదే ఎల్మ్ పుట్టగొడుగులయితే గది ఉష్ణోగ్రత వద్ద 3 రోజులు, ఫ్రీజ్ లో అయితే 7 రోజుల వరకు నిల్వ ఉంటాయి. కోసిన పచ్చి పుట్టగొడుగుల్ని10 శాతం ఉప్పు ద్రావణంలో ఊరవేసి పచ్చళ్ళు చేయవచ్చు. ఎండబెట్టి ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు. ముత్యపు చిప్ప పుట్టగొడుగులు 10-12 కిలోలు ఎండ బెడితే ఒక కిలో ఎండిన పుట్టగొడుగులు వస్తాయి. వాటిని కిలో రూ. 750 నుంచి రూ. 1000 వరకు అమ్ముకోవచ్చు లేదా ఎండిన పుట్టగొడుగుల్ని పొడి చేసి మసాల పొడి, నూడిల్స్, సూప్స్, అప్పడాలు వంటి ఉప ఉత్పత్తులు చేసి అమ్మటం లాభదాయకం.
డా. బి. రాజేశ్వరి, డా. శ్రీధర్ చౌహాన్, డా. భానురేఖ డా. జి. అనిత, డా. ఎం. సురేష్, కె. అపూర్వ. వ్యవసాయ కళాశాల, ఆదిలాబాద్.